Wednesday, 6 April 2011

అష్టావధానం ..ashtaavadhaanam



అష్టావధానం ఇతర భాషలలో కొంచెం వున్నా, తెలుగులోనే బాగా ప్రసిద్ధి పొంది ఇప్పుడు మన తెలుగు వాళ్ళకే పరిమితమైన ఒక అద్భుతమైన కళ ! తెలుగు తర్వాత ప్రాచుర్యం లో వున్నది ఒక్క సంస్కృతం లోనే !

చాలా పనులు ఒకేసారి చేసేవాళ్ళని చూసి మనం అష్టావధానం చేస్తున్నాడు అంటాము కానీ,       అసలు అష్టావధానం అంటే ఎనిమిది   సాహితీ పరమైన అంశాలతో కూడిన ఒక గొప్ప కళ... కళ కూడా కాదు... విద్య అనాలి. కళనీ కళాకారులనీ   చిన్నబుచ్చడం  నా ఉద్దేశం కాదు కానీ, అష్టావధానం కళ కంటే ఒక మెట్టు ఎక్కువ! అంటే " కొంచెం ఎక్కువ సమానం"  అన్న మాట !

ఎంతో మేధస్సు, ప్రజ్ఞా  పాటవం కావాలి అవధానం చెయ్యటానికి... ఇంకా ధారణా శక్తీ కూడా మెండుగా వుండాలి అవధానికి.

అష్టావధానంలో ఎనిమిది అంశాలు వుంటాయి.. వీటిని అడిగే వాళ్ళని  పృచ్ఛకులు   అంటారు. 

ఈ ఎనిమిది అంశాలు: (1) నిషిద్ధాక్షరి (2) న్యస్తాక్షరి (3) దత్త పది (4) సమస్య (5) కావ్యగానం (6) వర్ణన (7) ఆశువు/పురాణం (8) అప్రస్తుత ప్రసంగం 

ఒక్కోసారి వర్ణన, పురాణం, ఆశువులు మారుతూ వుంటాయి కానీ, మొత్తం మీద ఉండేవి ఎనిమిది  ఒక్కసారి ఘంటా నాదం కూడా వుంటుంది. 

ఇందులో చాల ప్రధానమైనవి సమస్య, నిషిద్ధాక్షరి, వ్యస్తాక్షరి, దత్తపది. 


వీటిని  ఛేదిస్తే     ... అవధానాన్ని సాధించినట్లే! పృచ్ఛకులు అడిగిన వాటికి అవధాని చందోబద్ధ పద్య రూపంలో సమాధానాలు చెప్పాలి. 

సమస్య: సమస్యలో కూడని/ పొసగని ఒక వాక్యాన్ని ఇస్తే, దానికి సరిపోయేలా (సరి చేసేలా) మిగిలిన మూడు పంక్తులు చెప్పాలి.

నిషిద్ధాక్షరి: ఈ పృచ్ఛకుడు  ఏదో ఒక విషయం మీద పద్యం చెప్పమని అడుగుతాడు, కానీ ఏ ఏ అక్షరాలూ నిషిద్ధమో  (వాడకూడదో) చెప్తూ ఉంటాడు. వాటిని వాడకుండా, భావం చెడ కుండా  తను చెప్పదలచుకున్నది అర్థవంతంగా చెప్పాలి. 

వ్యస్తాక్షరి: ఏదో ఒక వాక్యమో, పద్య భాగమో తీసుకుని అందులోని  ఒక్కో అక్షరాన్ని క్రమం లేకుండా వీలైనంత గందర గోళం గా అప్పుడప్పుడు ఇస్తాడు పృచ్చకుడు. అవధాని ఇవన్నీ విని, గుర్తు పెట్టుకుని చివర్లో మొత్తం వాక్యాన్ని చెప్పగలగాలి. తమాషా ఏమంటే, పాత    వాక్యాలే ఇవ్వక్కరలేదు... కల్పించి కూడా ఇవ్వవచ్చు  ఊహించలేకుండా! 

దత్తపది: పృచ్ఛకుడు ఇచ్చిన నాలుగు పదాలు  వినియోగిస్తూ అడిగిన భావం వచ్చేలా పద్య పూరణం చెయ్యాలి. 

ఇక మిగిలినవి- వర్ణన, ఆశువు, పురాణం
పృచ్చకులు అడిగిన వాటిని వర్ణించడమో , అడిగిన భావానికి ఆశువుగా పద్యం చెప్పటమో, పురాణ/కావ్యాల లోంచి పృచ్ఛకుడు   చెప్పిన పద్యానికి భావాన్ని, సందర్భాన్ని చెప్పడం చెయ్యాలి. 

ఇక ఘంటానాదం, అప్రస్తుత ప్రసంగం గొప్ప సాహితీ రూపాలు కాదు కానీ, అవధానిగారి దృష్టి మళ్ళడానికి   ప్రయత్నిస్తూ వున్నా, నిజానికి సభికులను రంజిల్ల చెయ్యడాని వుద్దేసింప బడినవి   . అప్రస్తుత ప్రసంగం కాదు, నిజానికి అప్రస్తుత ప్రశంస!

అంటే అప్రస్తుత విషయాలని ఉటంకిస్తూ వుండడం అవధానిని సమాధానాలు
అడుగుతూ వుండడం. నేర్పు వుంటే, ఒక విధంగా అవధానికి, కూడా ఇది ఆట విడుపే!
అవధానంలో ఇంకో గాన్మట్టైన విషయం ఏమంటే...

అవధాని సమాధానాలు తెలిసినా మొత్తం పద్యాలు ఒక్కసారి చెప్పకూడదు. నాలుగు ఆవృత్తులుగా విడగొట్టి ఒక్కో ఆవృత్తం   పూర్తి చేసి, ఆయా ప్రుచ్చకుడికి   చెప్పి... మళ్ళీ రెండో ఆవృత్తం లోకి వెళ్ళాలి.

ఇవన్నీ పూరణం- అంటే అప్పటికప్పుడు చెప్పడమయితే, అన్ని ఆవృత్తులూ పూర్తయ్యేక 'ధారణ' చేసి మళ్ళీ అన్నీ వరసగా చెప్పుకురావాలి . అంటే అప్పచెప్పడమన్న మాట! 

ఇవీ,  స్థూలంగా అష్టావధానం వివరాలు... అవధానాలలో  ఇంకా రకాలు  వున్నాయి -  చిత్రావధానం (painting), నృత్యావధానం  (Dancing) గణితావధనం   (Mathematics) నేత్రావధానం (using the eyes) ....మొదలైనవి .

అష్టావధానం గురించి అయ్యింది కనుక... ఇక అసలు అష్టావధానం లోకి, సమస్యలూ పూరణల లోకి వద్దాము... తరువాయి "పంచిక" లో (పంచి పెట్టే సంచిక కి నేను పెట్టిన పేరు)! 

ఇవ్వాళ్టికి  సెలవా మరి? 

మీ
- మూర్తి రేమిళ్ళ

తెలుగు తనం ఉట్టి పడిన శ్రీఖర ఉగాదితో ... స్వాగతం ! సుస్వాగతం !!


స్వాగతం ! సుస్వాగతం !!
నా మనసులో ఊహల్ని, మాటల్ని తెలుగులో... అచ్చ తెలుగులో మీతో పంచుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నది ఈ ఉగాదికి మొదలయ్యింది...
దానికి వేదిక ..ఈ బ్లాగిక   (బ్లాగ్ ఇక ) !!
దీని పేరు గల గలా గోదారి... అడ్రెస్ :http://murthyremilla.blogspot.com/ 
కోకిలమ్మల కూతలతో
మావికొమ్మల పూతలతో
వచ్చింది ఉగాది !
మీకు తెచ్చేందుకు
సంతోషాల నిధి !!
శ్రీ ఖర ఉగాది అందరికీ శ్రీ కరం కావాలని శుభాకాంక్షలు !!!

నాకు, నా లాంటి తెలుగు వాళ్ళందరికీ ఇది నిజంగా ఒక పండుగే !
ఒక రకంగా ఇది తెలుగు హ్యాట్రిక్ డే !
ఉదయం అన్ని ఛానెల్స్ లోనూ పంచాంగ శ్రవణం అయ్యేక..మొదలయ్యింది అసలు సిసలు తెలుగు పండుగ !
శ్రీ వెంకటేశ్వరా , ఇంకా  భక్తి చానల్స్ లో అవధానాల పరంపరతో .. ఒక చోట శ్రీ మేడసాని మోహన్ , మరో రెండు చోట్ల శ్రీ గరికపాటి ...
ఈ రోజు అతిరథ నాయకుడు గా  శ్రీ గరికపాటి నరసింహా రావు గారిని చెప్పుకోవచ్చు .
ఉగాది నాడు ఎలా వుంటే సంవత్సరం అంతా అలా వుంటుంది అన్న నమ్మకం నిజమైతే, ఇక  ఈ సంవత్సరం అంతా సాహిత్య సౌరభాల వెల్లువ వస్తుందని ఆ జడి వానలో మనందరం తడిసి ముద్దవుతామని, ఆ ప్రకారం శ్రీఖరం సాహితీ శ్రీకరం అవుతుందనీ ఆశిద్దాము !
ఇవ్వాళ వుట్టి మీంచి పడిన తెలుగుతనం మరింతగా పదునెక్కి మన మనసుల్ని రంజింప చేస్తుందని తలుద్దాము !!
మరొక్క సారి మీకందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియచేస్తూ..
(అష్ట్తవధానం విశేషాలు,పూరణలు రేపటి మాట లో ...)
మీ,
- మూర్తి  రేమిళ్ళ